ఆంధ్రప్రదేశ్‌లో గత కొద్దిరోజులుగా నెలకొన్న ఉద్యమాలకు కేంద్రబిందువులు రాజకీయ నిరుద్యోగులేనని మేధావులు విశ్లేషిస్తున్నారు. తెలంగాణా, సమైక్యాంధ్ర అంటూ వేర్పాటువాదంపై తమ శక్తినంతా ధారపోస్తున్న నాయకుల పేరు చెపితే ప్రజలు అసహ్యించుకుంటున్నారని వారంటున్నారు.
ప్రస్తుత ఉద్యమాల్లో తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నది మాత్రం సామాన్యుడే. ఆ సామాన్యుడు ఓటు వేస్తే గెలిచిన నాయకులు ఐదేళ్లపాటు ప్రజాసేవ చేస్తామని శపథం చేసి... ఆ విధిని మరచి అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించి మాకు తెలంగాణా కావాలంటూ రాజీనామాలకు తెగబడితే దానికి ఎవరు బాధ్యులు...? ఎన్నికలలో ఓటు వేయనివాడు దున్నపోతుతో సమానమని కొన్ని రాజకీయపార్టీలు ప్లకార్డులను ఎన్నికల సమయంలో ప్రదర్శించాయి. మరి ఎర్రటెండలో నిలబడి తమను ఐదేళ్లపాటు చల్లగా పరిపాలించాలన్న గంపెడాశతో ఓటు వేసిన ఓటరన్న ఆశలను రాజీనామాల పేరుతో కుళ్లబొడుస్తున్న నాయకులను ఏమని పిలవాలి...? దీనిపై నాయకులే ఆత్మవిమర్శ చేసుకోవాలి.
ఓటు వేయకుండా మిమ్మల్ని మీరు ఆత్మవంచన చేసుకోవద్దని లోక్‌సత్తా అధినేత చెప్పారు. లోక్‌సత్తా ఒక్కటే కాదు ప్రతిపార్టీ సైతం తమదైన శైలిలో ప్రజలకు నీతులు చెప్పాయి. మరి నేడు జరుగుతున్నదేమిటి..? ఓటుకు నాయకులు ఇస్తున్న విలువ ఏపాటిదో తెలుస్తూనే ఉంది. కేవలం తమ స్వార్థప్రయోజనాలకోసం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని బంద్‌లు, ఆందోళనల పేరుతో లూటీ చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వాలు కూలంకషంగా చర్చించాలి.
అసలు ఎన్నికలు జరిగి ఆరు నెలలు కూడా గడవక ముందే తెలంగాణా అంశం తెరపైకి ఎదుకు వచ్చినట్లు..? ప్రస్తుతం తెలంగాణా కావాలంటూ ఉద్యమాలకు శ్రీకారం చుట్టిన నాయకులకు ఎన్నికలకు ముందు ఈ ఉద్యమాలను చేయాలన్న ఆలోచన రాలేదా..? తీరా ఎన్నికల రూపేణా కోట్ల రూపాయలను ధారపోసిన తర్వాత ఇప్పుడు తెలంగాణా అంశం గుర్తుకు వచ్చిందా...? అని ప్రశ్నించుకున్నప్పుడు వైఎస్సార్ ఒక్కరే గుర్తుకువస్తారు. ఆయన ఉన్నట్లయితే ఈసరికే కొన్ని పార్టీలు కేరాఫ్ ఫ్లాట్‌ఫామ్‌గా మిగిలి ఉండేవే. ఇవ్వాళ అటువంటి పార్టీలు ప్రజలు వేసిన ఓట్లకు తూట్లు పొడుస్తూ ప్రజాస్వామ్యాన్నే అపహాస్యం చేస్తున్నాయి.
ఇక తెరాస అంశాన్ని తీసుకుంటే... 2004లో తెరాస మంత్రులు 10 మంది అమ్ముడుపోయారు. ఆ తర్వాత ఎన్నికలు సమీపిస్తుండగా తెలంగాణా ఇవ్వలేదనీ 16మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. అంతేకాదు రాజీనామా చేసిన స్థానాలన్నిటినీ కైవసం చేసుకుంటామని ప్రగల్భాలు పలికారు. చివరికి ఏం జరిగింది...? మొన్నటి ఎన్నికల్లో కేవలం 10 స్థానాలను మాత్రమే దక్కించుకోగలిగారు. అంటే ప్రజలు తెరాసను చీదరించుకున్నారనే కదా దీనర్థం. మొన్న హైదరాబాదు ఎన్నికల్లో పోటీ చేయకుండా తెరాస దాక్కుంది. నిలబడితే అసలు రంగు ఏమిటో, బలం ఏమిటో నిరూపితమయ్యేది.
కానీ తెలంగాణావాదానికి, ఎన్నికలలో నిలబడటానికి సంబంధమే లేదని చెపుతున్న తెరాస శాశ్వతంగా ఎన్నికలలో నిలబడకుండా కేవలం ప్రజాసేవ చేసేందుకే కట్టుబడి ఉండగలదా...? అసలు పదవులు లేకుండా తెలంగాణా ప్రజలకు సేవ చేయగల నిజాయితీ ఉన్నదా..? అయితే భవిష్యత్తులో తమకు ఎటువంటి పదవులు అక్కర్లేదని తెరాస బహిరంగంగా ప్రకటించినప్పుడే తెలంగాణా ప్రజలు వారి మాటలను విశ్వసిస్తారు.
ఏదేమైనా కొంతమంది స్వార్థ రాజకీయ నాయకుల ఆటతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తి అంధకారంలోకి నెట్టబడుతోంది. నిత్యావసర వస్తు ధరలు చుక్కలను చూస్తున్నాయి. తెలంగాణా సాధన నిత్యావసర ధరలను పెంచమని చెప్పిందా...? ప్రజలను తీవ్ర ఇక్కట్లపాల్జేయమని నిర్దేశించిందా...? చీటికిమాటికి బంద్‌లంటూ ప్రజాజీవితాన్ని అస్తవ్యస్తం చేయమని చాటుతోందా...? ఇటువంటి దురాగతాలకు పాల్పడే నాయకులకు భవిష్యత్తులో ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని అంటున్నారు.
ఇట్లు..
...... దగా పడుతున్న ఓటరు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment