తెలంగాణా రాష్ట్రం ఏర్పాటుకు కేంద్ర సమ్మతించడం తెలంగాణాలో ప్రజలలో ఉత్సాహం నింపింది. కానీ అటు కోస్తా, రాయలసీమలలో విభజన ప్రకటనతో అగ్గి రాజుకుంది. రాజీనామాల పర్వం ఊపందుకుంది. విద్యార్థులు, నాయకులు, పౌర సంఘాలు అందరూ ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టారు. దీనికి కారణం మీరంటే మీరని కాంగ్రెస్, తెలుగుదేశం, ప్రజారాజ్యం ఒకరిని ఒకరు దూషించుకోవడం మొదలుపెట్టాయి. రాజీనామాలలో 'పోటీ రాజకీయాలు' నెలకొన్నాయి. రాష్ట్ర విభజన కాంగ్రెస్ పాపమే అంటూ తెలుగుదేశం ఈ ఇష్యూని ఎక్కడ హైజాక్ చేస్తుందో అని కాంగ్రెస్ నాయకులు ముందుగానే రాజీనామాలు చేశారు. తెలుగుదేశం పార్టీకి కనీసం ఆ అవకాశాన్ని కూడా ఇవ్వకుండా సమైక్య ఆంధ్ర నినాదంతో తమ ఓటు బ్యాంకును స్థిరపర్చుకునేందుకు సిద్ధమయ్యారనటంలో ఏ మాత్రం సందేహం లేదు. తెలుగుదేశం కూడా అంతకు అంత కష్టపడుతూనే ఉంది.
అయితే ఈ సంక్షోభానికి కారణం ఎవరో తెలుసుకోవాలంటే ముందుగా మనం సమస్యకు దారితీసిన వరుసగా జరుగుతున్న సంఘటనలను గమనించాల్సి ఉంటుంది. తెలంగాణపై ముందుగా సమ్మతి తెలిపిన పార్టీ కాంగ్రెస్. 2004 సంవత్సరంలో తెరాసతో కలిసి పోటీచేసి విజయం సాధించిన తరువాత వైఎస్ వ్యతిరేకత వల్ల కావచ్చు, లేదా వ్యూహాత్మకంగా కావచ్చు తెలంగాణా పట్ల ఉదాశీనంగా వ్యహవరించింది కాంగ్రెస్ అధిష్టానం. ఈ ఉదాశీనత టిడిపిలో సమైక్య ఆంధ్ర విషయంలో ఒక రకమైన భద్రతా భావాన్ని కలిగించిందనే చెప్పాలి. తెలంగాణపై నిర్ణయం వెలువరించడంలో కాంగ్రెస్ అధిష్టానం చేసిన తాత్సారం తెలుగుదేశం పార్టీని బోల్తా కొట్టించిందనడంలో సందేహం లేదు. అది కాంగ్రెస్ వ్యూహాత్మకమే కావచ్చు. తెలంగాణా తేనెతుట్టెను కదపడానికి కాంగ్రెస్ అధిష్టానం సిద్ధంగా లేదనే ఒక భావం టిడిపిలో కలిగించింది.
ఎలాగూ కాంగ్రెస్ తెలంగాణా ఇవ్వడానికి సిద్ధంగా లేదని, కాబట్టి తాను వ్యతిరేకించి తెలంగాణా ప్రజల దృష్టిలో వ్యతిరేకత ఎందుకు పెంచుకోవాలని టిడిపి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సై అన్నది. ఈ భావం ఒక్క టిడిపిలోనే కాదు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కలిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అధిష్టానం తెలంగాణకు అనుకూలం కాదు అని కాంగ్రెస్ నాయకులు కూడా నమ్మారు. ఈ స్థితిలో కేసీఆర్ దీక్షకు పూనుకోవడం, ఉద్యమం పతాకస్థాయికి చేరడం, భారత ప్రభుత్వం తెలంగాణా ఏర్పాటుకు ఓకే చెప్పేయడం అన్నీ వెంటవెంటనే జరిగి పోయాయి.
ఆంధ్ర నాయకులు తేరుకొని చూసేపాటికి తెలంగాణా అనివార్యం అని తేలిపోయింది. పార్టీ భేదాలు లేకుండా, ఎవరికి వారు తమ తమ అధిష్టానాన్ని తప్పుపడ్డటం ప్రారంభించారు. కాంగ్రెస్ వారు, టిడిపి, ప్రజారాజ్యం పార్టీ ఇలా అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఒక్కసారిగా క్షేత్రస్థాయి నిజం గుర్తుకొచ్చింది. తమ నియోజకవర్గ ప్రజల మనస్సులో ఏముందో తెలుసుకోకుండా, విభజన వల్ల లాభ నష్టాలు చర్చించకుండా, అధిష్టానానికి తమ నిర్ణయాన్ని వదిలివేయడం ద్వారా ఈ సమస్య ఉత్పన్నమయిందని ఈ నాటికీ గ్రహించలేదు. ప్రజాస్వామ్యంలో ఇది ఒక రకంగా సిగ్గుపడవలసిన విషయం.
అమెరికాలో ఇటువంటి సమస్యలు ఎందుకు ఉత్పన్నం కావో తెలుసుకుంటే, ఇకనైనా ప్రజల అభీష్టానికి, అభిప్రాయానికీ ఒక విలువ వచ్చే అవకాశం ఉంది. అయితే, మన సమస్యకు, అమెరికాకి సారూప్యమేమిటని ప్రశ్నించవచ్చు. కాని మన రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు గాని, ఫెడరల్ వ్యవస్థ గాని, అసలు ప్రజాస్వామ్యం అనే భావన గాని అమెరికా రాజ్యాంగంలోంచి మనం అరువు తెచ్చుకున్నవే అన్న విషయం గమనించాలి.
ప్రజాస్వామ్య వ్యవస్థలో, మనం ఇంకా పరిణితి చెందుతున్నాం. అమెరికాలో జరిగే రాజకీయ ప్రక్రియ పరిణామాలు మన దేశంలో మరో ఏభై ఏళ్ళకు జరగవచ్చు. కానీ మనం అమెరికా రాజకీయ ప్రక్రియలు ఏ విధంగా జరుగుతాయో ఆ దిశగా ప్రయాణం చేస్తున్నాం. అమెరికాలో ఒబామా సూచించిన హెల్త్ కేర్ బిల్ విషయానికి వస్తే, ఇక్కడ జరుగుతున్న రాజకీయ ప్రక్రియ చూస్తే, ఇంకా మనం ఎంత పరిణితి చెందాలి అన్న విషయం తెలుస్తుంది. ఒక ప్రజా సమస్యను ఏ విధంగా డీల్ చెయ్యాలి అనే విషయం మన రాజకీయ నాయకులు తెలుసుకోవాలి. మన ఎమ్మెల్యేలు, మంత్రులు వివిధ దేశాలలో పరిపాలన ఎలానో అభ్యాసం చేయడానికి ప్రజా ధనంతో విదేశీ ప్రయాణాలు చేస్తారు. అటువంటి ప్రయాణాలలో కనీసం ఉద్దేశ్యాలను నెరవేర్చినా ఈ రోజు ఈ సంక్షోభం ఎదురయ్యేది కాదు.
ఒబామా గత నెలలో అమెరికా కాంగ్రెస్ హౌస్ లో తన చిరకాల స్వప్నమైన హెల్త్ కేర్ బిల్ ప్రవేశపెట్టినారు. రిపబ్లికన్లు ఈ బిల్లును సహజంగానే వ్యతిరేకించారు. దీంట్లో ఆశ్చర్యం ఏమీ లేదు. డెమోక్రాట్లు పెట్టిన బిల్లు రిపబ్లికన్లు వ్యతిరేకించారు. కానీ ఈ బిల్లును ఒబామా సొంత పార్టీకి చెందిన 39 మంది డెమోక్రాటిక్ కాంగ్రెస్ సభ్యులు కూడా వ్యతిరేకించారు. కారణం ఏమిటంటే తమ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలకు బిల్లు వ్యతిరేకంగా ఉన్నందున బిల్లును వ్యతిరేకించారు. అంతే కాని, తమ అధిష్టానం అని ఒబామాకో, లేదా డెమోక్రాటిక్ నాయకత్వానికో వదిలెయ్యలేదు.
అంటే అమెరికా కాంగ్రెస్ సభ్యులు తమ హక్కును వినియోగించుకున్నారు. మన దగ్గర మన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎప్పుడూ తమ హక్కును అధిష్టానం చేతిలో గానీ, సీఎం చేతిలో గానీ, పీఎం చేతిలో పెట్టడమే తెలుసు. అసలు తమకు అలాంటి ఒక హక్కు ఉందనీ, దాన్ని తాము ఉపయోగించుకోవచ్చునని బహుశా మన ఎమ్మెల్యేలు మర్చిపోయారు. గంగిరెద్దు లాగా తీర్మానాలకు తలూపడం అలవాటుగా మారిన వారికి, తాము తలూపింది తమ తలరాతలు మార్చే నిర్ణయాలని తెలిసేదెప్పుడో?
ఇప్పటికైనా మన ప్రజాప్రతినిధులు తెలుసుకోవలసిందేమిటంటే తమను ప్రజలు ఎన్నుకున్నది వారి గొంతుకగా మారి వారి సమస్యలను చర్చించాలని. సొంత లాభం కోసం అధిష్టానానికి తమ నిర్ణయాలను వదిలివేయవద్దని. ఎమ్మెల్యేలుగా తమ హక్కులను ఉపయోగించుకోవాలని. ప్రజాస్వామ్యం అంటేనే చర్చ. ఏ చర్చా లేకుండా పార్టీలకు నిర్ణయాధికారాలు వదిలేసినంతకాలమూ నాయకులు పార్టీలకు ఏజెంట్లుగా మారతారే తప్ప ప్రజాప్రతినిధులుగా ఎప్పటికీ కాలేరు.
Subscribe to:
Post Comments (Atom)
ఇక్కడ ఎవరూ కూడా తార్కికంగా ఆలోచించటం లేదు. మనం అందరం ఒక్క తల్లి బిడ్డలమే అయినా కానీ ఇలా కుక్కల్లా కోట్లాడుకోవడం మాత్రం ఏమి బావో లేదు. రాజకీయాల్లో సరైన పరిష్కారం లేదా తప్పు పరిష్కారం అంటూ ఉండవు. కేవలం మన సౌలబ్యం కోసం మనం అందరికీ అమూదయోగ్యం ఐన పరిష్కారం కనుక్కోవటం మాత్రం కావలి. ఇలా ఒకరి మీద ఒకరు బురద చల్లుకుని మనమే కరెక్ట్ అనుకునే నైజం పోవాలి. ఆంద్ర వాళ్ళు పోగారుబోతులని, తెలంగాణ వాళ్ళు సోమరిపోతులని ఇలాంటి gross generalizations చేసుకోవటం మన అవివేకం కాదా? మనవ సంబందాలు తెగిపోయాక ఇక కలిసున్నాలేకపోయినా పెద్ద లాబం లేదు. ఉద్యోగాల్లో, నీటి వనరుల వినియోగంలో తెలంగాణ వాళ్ళకి అన్యాయం జరిగింది (వాళ్లకి తెలివితేటలూ ఉన్నాయా లేదా అన్న విషయం పక్కన పెడితే) అన్న విషయం వాస్తవం. అలాగే హైదరాబాదు అభివృద్ధిలో అందరి చేయి ఉంది, కానీ ఇప్పుడు దానిని వదిలెయ్యాలి అనటం పూర్తీ గా అన్యాయం. ఇలాంటి పరిస్తితులలో చదువుకున్న మనం ప్రస్తుతం సంయమనం పాటించి అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కోసం పాటు పడేలా ప్రోత్సహించాలి. అంతే కాని రోజు రోజుకి పడిపోతున్న సౌబ్రాతుత్వాన్ని మరింత తొక్కి మనకి మనం ఏమి మంచి చేసుకోవటం లేదు. Negotiations అందరికి అన్ని లాబాలు జరగవు, మనం కొన్ని పక్కవారి విషయంలో పస ఎంత ఉంది అనేది అలోచించి సర్దుకు పోవడం ముఖ్యం. అన్నింటి కన్నా ముఖ్యం, ఇది జీవన్మరణ సమస్య కాదు. కాని మనల్ని మనం కించ పరుచుకుమ్తున్న విదానం మాత్రం హేయం. అందరం కలుద్దాం పరిష్కారం వెతుకుదాం. రాజకీయంగా కాదు. బ్లాగు పరంగా. ఏమంటారు? కనీసం ఇక్కడైనా మనం వివేకులం అని చెప్దాం. సరైన బ్లాగ్ తయారు చేద్దాం, ఫోరం తయారు చేద్దాం, అందరికి నచ్చేట్టుగా నాయకులను (moderators) ఎన్నుకుని రాజకీయాలతో సంబంధం లేకుండా మనకి మనం పరిష్కారం చర్చిద్దాం. ఇది నేను అన్ని బ్లాగులలో పోస్టు చేస్తున్నాను. దయచేసి అందరం దగ్గరికి వద్దాం. విషం చిమ్ముకోవటం ఆపేద్దాం.
ReplyDelete