Thursday, March 11, 2010

హైదరా"భాగో".. వై"జాగో": విశాఖలో విశాల అవకాశాలు!

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తన ప్రాభవాన్ని మెల్లగా కోల్పోతోంది. ఐటీ రంగంలో అంతర్జాతీయ ఖ్యాతిగడించిన ఈ నగరంపై ప్రస్తుతం నీలి నీడలు కమ్ముకున్నాయి. తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాల పుణ్యమాని రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి నెలకొంది. ఫలితంగా అంతర్జాతీయ కంపెనీలు ఈ నగరానికి ముఖం చాటేస్తున్నాయి. ఫలితంగా ఒకపుడు ఎంతో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన భాగ్యనగరం.. ప్రస్తుతం ఉపాధి అవకాశాల కల్పనలో అట్టడుగు స్థాయికి పడిపోయే ప్రమాదం పొంచివుంది.

అదేసమయంలో ఓడరేవు నగరంగా పేరుగాంచిన విశాఖపట్టణం ఇకపై రాష్ట్ర ఐటీ హబ్‌గా అవతరించనుంది. ఇది సీమాంధ్ర ప్రాంత యువతీ యువకులకే కాకుండా తెలంగాణ ప్రాంత యువకులకు కూడా ఓ శుభవార్తలాంటిందే. మాఫోయ్ అనే అంతర్జాతీయ సంస్థ నిర్వహించిన తాజాగా సర్వేలో ఈ హైదరాబాద్ పరిస్థితిని కళ్ళకు కట్టినట్టు వివరించింది.ఉపాధి అవకాశాలు గణనీయంగా తగ్గిపోతున్నట్టు ఈ సర్వే తేల్చింది. అదేసమయంలో అంతర్జాతీయ ఐటీ కంపెనీలన్నీ విశాఖ నగరంపై దృష్టి సారించినట్టు పేర్కొంది. దీన్ని నిజం చేసేలా ప్రపంచ సాఫ్ట్‌వేర్ దిగ్గజం ఐబీఎం వైజాగ్‌లో "గ్లోబెల్ సెంటర్‌"ను నెలకొల్పే దిశగా ప్రణాళికలు రూపొందిస్తోంది.

ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, మానవ వనరులు, రవాణా, తదితర అంశాలపై ఐబీఎం‌కు చెందిన 12 మంది నిపుణుల కమిటీ వైజాగ్‌లో పర్యటిస్తూ అధ్యయనం చేస్తోంది. ఈ బృందం ఆంధ్రా వర్శిటీ ప్రొఫెసర్లు, ఇతర నిపుణులతో కూడా సమావేశమై సమీక్ష నిర్వహిస్తుంది. పైపెచ్చు.. హైదరాబాద్‌తో పోల్చితే వైజాగ్‌లో ఉద్యోగస్తులను తక్కువ జీత భత్యాలకు ఎంపిక చేసుకోవచ్చనే భావన ఐటీ కంపెనీలకు ఏర్పడింది. దీంతో ఐబీఎం గ్లోబెల్ సెంటర్‌ ఏర్పాటుకు ఎక్కువగా మొగ్గు చూపుతోంది.

దీనికి తోడు.. ఇట్టే ఆకర్షించే సముద్ర తీర ప్రాంతం, కనువిందు చేసే రిషికొండలు, అరకు వంటి పర్యాటక ప్రాంతాలు వైజాగ్‌‌కు మరింత పర్యాటకట శోభను తెచ్చిపెడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంతో పోల్చుకుంటే ఇక్కడ ట్రాఫిక్ సమస్య లేకపోవడం అంతర్జాతీయ కంపెనీలను ఎంతగానో ఆకర్షిస్తోంది. అలాగే, భాగ్యనగరం కంటే వైజాగ్ ఎంతో ప్రశాంతమైన నగరంగా పేరుగడించింది. ఇప్పటి వరకు ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన దాఖలాలు లేవు. అదే హైదరాబాద్ విషయానికి వస్తే హిందు-ముస్లిం అల్లర్లు, తెలంగాణ ఉద్యమం, గూండాయిజం, భూకబ్జా ఇలా అనేక సమస్యల ఉన్నాయి. అలాగే వైజాగ్‌లో కాస్ట్ ఆఫ్ లివింగ్‌ హైదరాబాద్‌తో పోల్చితే చాలా తక్కువ. పైపెచ్చు భూముల ధరలు కూడా చౌకే. ఇక్కడ ప్రభుత్వ ఆధీనంలో వందలాది ఎకరాలు ఇక్కడ ఉన్నాయి.

ఇక్కడ పరిశ్రమలు స్థాపించే కంపెనీలకు ప్రభుత్వం ప్రత్యేక రాయితీలు కల్పిస్తోంది. ఒక్క రిషి కొండలోనే 20 సెజ్ కంపెనీలు అనుమతి పొందగా, వీటిలో 12 కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించడం ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. అలాగే విద్యాశాతంతో పోల్చితే హైదరాబాద్ కంటే వైజాగ్ ప్రజలు ఎక్కువ విద్యావంతులు కావడం గమనార్హం.

ఇదిలావుండగా, వచ్చే మూడేళ్ళలో దేశ వ్యాప్తంగా పది లక్షల ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో 20 నుంచి 25 వేల ఉద్యోగాలు ఒక్క వైజాగ్ నగరంలో అందుబాటులో ఉంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. మొత్తం మీద తెరాస అధినేత కేసీఆర్ చేపట్టిన తెలంగాణ ఉద్యమం పుణ్యమాని హైదరాబాద్ నగరం తన శోభను కోల్పోతుండగా, వైజాగ్‌లో భారీ ఎత్తున ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

No comments:

Post a Comment