Tuesday, January 5, 2010

తెలంగాణ ఉద్యమ స్వరూపంతో మారిన కేంద్ర వైఖరి!

హింసాయుత తెలంగాణ ఉద్యమ స్వరూపంతో కేంద్ర వైఖరి మార్చుకుంది. ఫలితంగా రాష్ట్రంలోని ఎనిమిది గుర్తింపు పొందిన పార్టీలను న్యూఢిల్లీకి ఆహ్వానించి శాంతి మంత్రం జపించేలా చేసింది. శాంతిభద్రతల పరిరక్షణపై పూర్తి బాధ్యతను రాష్ట్ర రాజకీయ పార్టీలపై పెట్టింది. రాష్ట్రంలో పరిస్థితులు చక్కబడని పక్షంలో తామే రంగంలోకి దిగుతామని చిదంబరం చెప్పకనే చెప్పారు.

తెలంగాణపై కేంద్ర ప్రకటన వెలువడటంతోనే సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసింది. వీరిని శాంతి పరిచేందుకు కేంద్రం మరో ప్రకటన చేసింది. దీంతో అప్పటి వరకు శాంతియుతంగా సాగుతున్న తెలంగాణ ఉద్యమ స్వరూపం ఒక్కసారి తన రూపురేఖలను మార్చుకుంది. ఆ తర్వాత మరో ప్రకటన చేయాల్సి వచ్చింది.

ఈ నెల 5వ తేదీన రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నట్లు చిదంబరం ప్రకటించారు. ఈ ప్రకటన తెలంగాణ ఉద్యమకారుల్లో మరింత ఆగ్రహం తెప్పించింది. ఫలితంగా తెలంగాణలో జరిగిన ఉద్యమం, మారిన తెలంగాణా వాదుల వ్యవహారశైలిని కేంద్ర నిఘా వర్గాలతో పాటు రక్షణ శాఖ నిఘా వర్గాలు, రాష్ట్ర గవర్నర్‌లు కేంద్రం దృష్టికి తెచ్చాయి.

భాషా ప్రయోగంలో మార్పొచ్చింది. హింసావాదం చోటు చేసుకుంది. మావోయిస్టులు తెలంగాణా ఉద్యమంలోకి ప్రవేశించారు. రక్తపాతం ద్వారానే రాష్ట్రసాధన సాధ్యపడుతుందని పిలుపునిచ్చారు. మావోయిస్టు అగ్రనేత మల్లోజుల స్వయంగా మీడియా ముందుకు వచ్చిన మద్దతు ప్రకటించారు. ఉద్యమంలోకి అసాంఘిక శక్తుల ప్రవేశం కూడా జరిగిందన్న కేంద్ర అనుమానాలకు ఇది మరింత బలం చేకూర్చింది. ఇదంతా కేవలం ఐదారు రోజుల్లోనే చోటు చేసుకోవడం గమనార్హం.

దీంతో కేంద్రం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించింది. ఉద్యమాన్ని రాజకీయ దృష్టి కంటే శాంతిభద్రతల దృష్టితో చూడాలనే నిర్ణయానికి వచ్చింది. తన తొలి ప్రకటనను సవరించుకునే దిశగా ప్రయత్నించింది. ప్రత్యేకవాదంపై తన అభిప్రాయాన్ని పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి, శాంతిభద్రతల పునరుద్ధరణపై మనస్సు లగ్నం చేసింది. వీటి ఫలితమే మంగళవారం కేంద్ర అఖిలపక్షంతో జరిపిన చర్చల ఫలిత సారాంశం.

ఈ చర్చలకు ముందు అంటే.. ఐదురోజుల పాటు తెలంగాణా ఉద్యమకారులు సంయమనం పాటించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని నిఘా వర్గాల ఉన్నతాధికారులతో పాటు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అప్పటికే రాష్ట్ర విభజనపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఇచ్చింది కూడా.

ఇలాంటి తరుణంలో హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో నివశిస్తున్న ఆంధ్రా, రాయలసీమ ప్రజల ఆకాంక్షలను తెలుసుకునే ప్రయత్నం చేసి వారికి తమ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదన్న భరోసాను తెలంగాణ ఉద్యమకారులు కల్పించడంలో విఫలమయ్యారు. ఇదే సాధించి ఉంటే.. తెలంగాణా రాష్ట్ర సాధన ప్రయత్నం మరో అడుగు ముందుకు పడివుండేది.

ప్రస్తుత పరిస్థితుల్లో అటు కేంద్రంతో పాటు.. జాతీయ స్థాయిలోని పలు పార్టీలో తెలంగాణ అంశంలో తమ వైఖరిని మార్చుకుంటున్నాయని చెప్పవచ్చు. ఎందుకంటే.. రాష్ట్రంలో శాంతిభద్రతలను పరిరక్షించాల్సిన బాధ్యతను మంగళవారం నాటి సమావేశంలో చిదంబరం పదేపదే నొక్కి చెప్పారు.

ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీలు కూడా శాంతిభద్రతల పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశాయి. ఒకట్రెండు పార్టీలైతే ఏకంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశాయి. కేంద్ర విజ్ఞప్తి తర్వాత కూడా శాంతిభద్రతలు చక్కబడని పక్షంలో ప్రత్యక్ష చర్యలకు సైతం దిగే అవకాశాలు లేకపోలేదని చిదంబరం వ్యవహరిస్తున్న వైఖరి తేటతెల్లం చేస్తోంది.

1 comment: