రాష్ట్ర చిత్ర పరిశ్రమలో "ముగ్గురు మొనగాళ్లు"గా చిరంజీవి బ్రదర్స్‌కు గుర్తింపు వుంది. నిన్నామొన్నటి వరకు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మరో హీరో నాగేంద్రబాబులు తమ ఆధిపత్యాన్ని చాటుతూ వచ్చారు.అయితే, చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆరంభంలో చిరంజీవికి మిగిలిన ఇద్దరు సోదరులు వెన్నుదన్నుగా నిలిచారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ప్రజారాజ్యం పార్టీ పూర్తిగా నిరాశపరిచింది. దీంతో ఒక్కొక్కరు వెన్ను చూపసాగారు.పార్టీ కార్యక్రమాలకు పవన్ కళ్యాణ్ పూర్తిగా దూరమయ్యారు. ఆయన నేతృత్వంలోని యువరాజ్యం ఏమైందో కూడా తెలియని పరిస్థితి. ఇకపోతే.. నాగేంద్రబాబు చిత్ర నిర్మాణాల్లో పూర్తిగా మునిగిపోయారు. అడపాదడపా మాత్రమే తళుక్కున మెరుస్తున్నారు.ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు మహోధృతంగా సాగాయి. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన 15 మంది (చిరు మినహా) ఎమ్మెల్యేల ఒత్తిడికి తలొగ్గిన చిరంజీవి తెలంగాణకు టాటా చెప్పి సమైక్యాంధ్రకు జై కొట్టారు. దీంతో పార్టీ రెండుగా చీలిపోయింది. తెలంగాణ నుంచి ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలు తెరాస చెంతకు చేరారు.దీంతో "అందరివాడు"గా ఉన్న చిరంజీవి.. ప్రస్తుతం కొందరివాడుగా మారిపోయారు. దీన్ని పవన్ కళ్యాణ్ ఏమాత్రం జీర్ణించుకోలేక పోయారు. తనను నమ్ముకుని వచ్చిన అనేక తెలంగాణ ప్రాంత అభిమానులకు ద్రోహం చేసినట్టుగా పవన్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని బయటపడలేక లోలోన కుమిలి పోతున్నారట.దీంతో తనకు నమ్మకస్తులుగా ఉన్న తెలంగాణ ప్రాంత పార్టీ నేతలు పవన్‌ను కలిసి తమకు జరిగిన అన్యాయాన్ని వెళ్లగక్కారు. వారి మాటలకు చలించిన పవన్.. మీ భవిష్యత్... మీ ఇష్టం అని సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరేందుకు పరోక్షంగా తన సమ్మతిని తెలిపినట్టు సమాచారం.
అందువల్లే ప్రరాపా అధికార ప్రతినిధి శ్రవణ్ కుమార్ తెరాస తీర్థం పుచ్చుకున్నట్టు ఆయన సన్నిహితులు చెపుతున్నారు. ఈ సంఘటనతో చిరంజీవి వైఖరితో విసిగి పోయిన పవన్ కళ్యాణ్ అన్నపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు టాలీవుడ్ వర్గాల కథనం. మొత్తం మీద చిత్ర సీమలో 'ముగ్గురు మొనగాళ్లు'గా మెలిగిన చిరంజీవి బ్రదర్స్ రాజకీయాల్లో మాత్రం "ఎవరికి వారే యమునా తీరు"గా వ్యవహరిస్తున్నారు. ఇది వారి అభిమానులకు మాత్రం ఏమాత్రం మింగుడు పడటం లేదు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment